పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసిన నటుడు రాహుల్ రామకృష్ణ!

  • పెసా, 1/70 చట్టాల అమలుపై వివరణ కోరిన నటుడు
  • ప్రశ్నించినంత మాత్రాన దేశద్రోహిని కానంటూ వివరణ
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన రాహుల్ రామకృష్ణ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ప్రముఖ నటుడు రాహుల్ రామకృష్ణ సామాజిక మాధ్యమాల్లో సంధించిన ప్రశ్నలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. గిరిజన సంక్షేమం, స్థానిక పాలనకు సంబంధించిన కీలక చట్టాల అమలుపై ఆయన స్పష్టత కోరారు. ఈ మేరకు 'ఎక్స్' వేదికగా పవన్ కల్యాణ్‌ను ట్యాగ్ చేస్తూ రాహుల్ వరుస పోస్టులు చేశారు.

తన పోస్టులలో ప్రధానంగా పెసా చట్టం, గిరిజన భూరక్షణకు ఉద్దేశించిన 1/70 చట్టం అమలుతో పాటు గ్రామసభల పనితీరు, పురోగతిపై వివరాలు కోరారు. అటవీకరణ కార్యక్రమాల నివేదికల్లోని గణాంకాలు అనుమానాస్పదంగా ఉన్నాయని పేర్కొంటూ, క్షేత్రస్థాయిలో ధృవీకరించిన ఫలితాలను బహిర్గతం చేయాలని అడిగారు.

కాగా, ఈ పోస్టులను ఆయన "జై తెలంగాణ!" నినాదంతో ముగించడం గమనార్హం. ఈ పోస్టులపై సామాజిక మాధ్యమాల్లో భిన్నమైన స్పందనలు రావడంతో ఆయన మరోసారి వివరణ ఇచ్చారు. ఒక అభిమానిగా, బాధ్యతాయుత పౌరుడిగా ప్రజాప్రతినిధిని ప్రశ్నించే హక్కును వినియోగించుకుంటున్నానని స్పష్టం చేశారు. "ప్రశ్నించినంత మాత్రాన నేను దేశద్రోహిని కాదు" అని పేర్కొంటూ, పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలోని అంశాలపైనే తాను వివరణ కోరుతున్నట్లు వెల్లడించారు.

ఈ పరిణామాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పవన్ కల్యాణ్ మద్దతుదారులు ప్రభుత్వ విజయాలను ఈ సందర్భంగా ఉటంకిస్తున్నారు. 2025లో విశాఖలో 'పెసా మహోత్సవ్' నిర్వహణ, 2024లో ఏకకాలంలో 13,000 పంచాయతీలతో ప్రపంచ రికార్డు స్థాయిలో గ్రామసభ నిర్వహించడం వంటి అంశాలను వారు ప్రస్తావిస్తున్నారు. మరోవైపు, ప్రజాప్రతినిధులను ప్రశ్నించడం పౌరుడి ప్రాథమిక హక్కని పేర్కొంటూ పలువురు నెటిజన్లు రాహుల్‌ రామకృష్ణకు మద్దతు తెలుపుతున్నారు.

Rahul Ramakrishna
Pawan Kalyan
PESA Act
Andhra Pradesh Deputy CM
Tribal Welfare Laws

More Telugu News